కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన గవర్నర్ తమిళసై

తెలంగాణ గవర్నర్ తమిళసై ..సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు.ఆదివారం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన నేపథ్యంలో.. ఈ రోజు గవర్నర్ అమిత్ షాను కలవడం ప్రధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, మునుగోడు ఉప ఎన్నిక, ఇతర అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తుంది. గవర్నర్ గా మూడు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని, నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా అమిత్ షాను కలిశానని ఆమె తెలిపారు. ఇది సాధారణ మీటింగ్ మాత్రమేనని గవర్నర్ స్పష్టం చేశారు. గత మూడేళ్లకు సంబంధించిన రిపోర్టును కేంద్రానికి ఇచ్చానని తెలిపారు.

విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాల భర్తీని పర్యవేక్షించే ‘కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఉదయమే గవర్నర్ లేఖ రాశారు. రాజ్ భవన్ కు వచ్చి ఈ బిల్లు గురించి తనతో చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఆమె సూచించారు. గత 8 సంవత్సరాలుగా వర్సిటీల్లో రిక్రూట్మెంట్స్ ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రిక్రూట్మెంట్స్ చేస్తే ఎలా చేస్తారు ? లోకల్ అభ్యర్థులకు ఎంతమేరకు ప్రాధాన్యత ఉంటుంది ? కేటగిరీల విభజన ఎలా ఉంటుంది ? అనే అంశాలపై రాష్ట్ర సర్కారును గవర్నర్ వివరణ కోరారు.