అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది – మంత్రి ఎర్రబెల్లి

గత మూడు రోజులుగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట నీళ్లపాలైందని వాపోతూ, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా మాటేడు గ్రామంలో రాత్రి వడగళ్లవానతో నష్టపోయిన పంటలను, పండ్లతోటలను ఆదివారం పరిశీలించారు. మిరప, మొక్కజొన్న, మామిడి, టమాటో, వరి, కూరగాయలు వంటి పంటలతోపాటు కొన్ని చోట్ల ఇండ్లు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు.

నష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. అధికారులు పంట నష్టాల అంచనా వేస్తున్నారని ఆయన వివరించారు. వ్యవసాయ, రెవెన్యూ వంటి శాఖల అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని, పంట నష్టాల అంచనాలు తేలిన తర్వాత పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు పంటల నష్టం అంచనా వేస్తున్నామని అన్నారు.