చీటికిమాటికి అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదు

మీరేమీ చక్రవర్తులు కారు.. అలా పిలవటం వల్ల మీ గౌరవం పెరిగిపోదు
మీకు నచ్చినట్లుగా ప్రభుత్వాలు నడవాలనుకోవద్దు
కొన్ని హైకోర్టులకు ఇది అలవాటైపోయింది..సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : న్యాయమూర్తులు ‘చక్రవర్తుల్లా’ ప్రవర్తించడం, చీటికిమాటికి ప్రభుత్వాధికారులను కోర్టుకు పిలవడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పద్ధతికి స్వస్తి పలకాలని సూచించింది. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలుస్తూ న్యాయవ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అధికారాల మధ్య విభజన రేఖను దాటితే ‘ప్రతిచర్య’ తప్పదని ఎస్‌కే కౌల్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. అధికారులను అప్పటికప్పుడు రమ్మనడం వల్ల వారు ఇతర కార్యక్రమాలను విడిచిపెట్టాల్సి వస్తుందని జస్టిస్ గుప్తా పేర్కొన్నారు. ఇలాంటి ఆదేశాల వల్ల కొన్నిసార్లు సుదూర ప్రయాణం చేయాల్సి రావొచ్చని, కాబట్టి అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవకూడదని గుప్తా అన్నారు.

అధికారులను తరచూ కోర్టుకు పిలవడం ప్రశంసనీయం కాదని, ఇది బలమైన పదాలతో ఖండించాల్సిన విషయమన్నారు. న్యాయమూర్తులు తమ పరిధిలో అణకువతో, నిగర్వంగా వ్యవహరించాలి తప్పితే చక్రవర్తుల్లా ప్రవర్తించకూడదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవడం వల్ల న్యాయస్థానం గౌరవం పెరగదని పేర్కొంది. విధుల్లో చేరని ఉత్తరాఖండ్ అధికారులకు సగం జీతం చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అనుచితంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులను రద్దు చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/