జింఖానా గ్రౌండ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్

జింఖానా గ్రౌండ్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. క్రికెట్ టికెట్ల గందరగోళంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. అసలు ఎన్ని టికెట్లు ఉన్నాయి..ఎన్ని ఆన్లైన్లో పెట్టారు.. ఎంతమందికి కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చారు అనేది తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం జింఖానా గ్రౌండ్ వద్ద ఉన్న అభిమానులను పోలీసులు ఇంటికి పంపిస్తున్నారు. టికెట్స్ అయిపోయాయని , ఇక్కడి నుండి వెళ్లిపోవాలని సూచించారు. జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ తొక్కిసలాటలో మరో 20మంది గాయపడ్డారు . పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాటలో చాలా మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది.

దాదాపు ఐదు రోజులుగా ఫ్యాన్స్ టికెట్స్ కోసం జింఖానా, ఉప్పల్ స్టేడియం చుట్టూ తిరుగుతున్నారు. మొదట్లో ఆన్ లైన్ లో అమ్మినా.. ఆ తర్వాత బుక్ చేసుకున్నవాళ్లకు కూడా డబ్బులు వెనక్కి వచ్చాయి. అటు ఆన్ లైన్ లో, ఇటు ఆఫ్ లైన్ లో టికెట్స్ దొరక్కపోవడంతో ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోయింది. నిన్న వేలాదిగా గ్రౌండ్ కు చేరుకోవడం, HCAపై వత్తిడి పెరగడంతో.. ఇవాళ టికెట్స్ ఇస్తామంటూ HCA ఫ్రకటించింది. వేలాదిమంది వస్తారు అని తెలిసినా ఒక్కటే కౌంటర్ పెట్టడం ఫై అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.