పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: ఉత్తమ్ కుమార్

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై చ‌ర్చా స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతోమాట్లాడుతూ… ఖరీఫ్ పంట కొనుగోలులో రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్ధతు ధర లభించడంలేదని విమర్శించారు. ప్రభుత్వ తీరు మారని ప‌క్షంలో రైతుల పక్షాన ఉద్యమం చేస్తామన్నారు. లక్షల కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రభుత్వం.. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో విఫలం అయిందన్నారు. ఖరీఫ్ పంట కొనుగోలు పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని వాపోయారు.

ఇప్పటి వరకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. మిల్లర్లను కనీస మద్దతుధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంటలపై , వరి పై ఆంక్షలు పెట్టొద్దన్నారు. పంట కొనుగోలు పై అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారన్నారు. రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ వారికి కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల విషయంలో అమాయక గిరిజనులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. ఈ సమావేశం లో డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, నాయకులు తూముల భుజంగ రావు, చకిలం రాజేశ్వర్ రావు,గుడిపాటి నర్సయ్య,అంజద్ అలీ, కక్కిఱేని శ్రీనివాస్, బైరు శైలేందర్,పొలగాని బాలు, నరేందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/