శ్రీలంక అధ్యక్షుడిగా గోటాబయ రాజపక్సె ఎన్నిక

Gotabaya Rajapaksa
Gotabaya Rajapaksa

కొలంబో: శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి) అభ్యర్థి గొటాబయా రాజపక్సే (70) ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ఎన్నికల కమిషన్‌ చైర్మన్‌ మహింద దేశప్రియ నాడిక్క అధికారికంగా ప్రకటించారు. యుద్ధ సమయంలో రక్షణ శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన గొటాబయ రాజపక్సె శ్రీలంకలో మళ్లీ జాతుల చిచ్చు రగిల్చే యత్నం చేయొచ్చని పలువురు పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఆయనపై యుద్ధ నేరాలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలున్నాయి. 2005-2015 మధ్య కాలంలో రాజపక్సెల పాలనలో ప్రభుత్వాన్ని విమర్శించిన పలు జర్నలిస్టులను ఎత్తుకెళ్లి, చిత్ర హింసలు పెట్టి, చంపేసిన ఉదంతాలున్నాయి. వేలాది మంది ప్రజలు ముఖ్యంగా తమిళులు అదృశ్యం కావడమో, తరిమివేయబడడమో జరిగింది. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవని గొటాబయ రాజపక్సె చెప్పారు.

అధికారికంగా వెల్లడైన ఫలితాల ప్రకారం రాజపక్సె కు 69,24, 255 ఓట్లు(52.25 శాతం) లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి, పాలక యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి) అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాసకు 55,64,239ఓట్లు( 41.99 శాతం) లభించాయి. మూడో స్థానంలో నిలిచిన అనూర కుమార దిసనాయకెకు కేవలం 4,18, 553 ఓట్లు (3.16 శాతం) వచ్చాయి. సాజిత్‌ ప్రేమదాస తన ఓటమిని అంగీకరిస్తున్నుట్లు ఇప్పటికే ప్రకటించారు. సింహళీయుల ప్రాబల్యం ఉన్న చోట రాజపక్సెకు స్పష్టమైన ఆధిక్యత లభించగా, ప్రేమదాసకు తమిళులు అధికంగా ఉన్న ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఎక్కువ ఓట్లు లభించాయి. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సెకు గొటాబయ రాజపక్సె సోదరుడు. రాజపక్సె ఎల్‌టిటిఇపై యుద్ధం ప్రకటించి 2009లో దానిని పూర్తిగా ఓడించాడు. ఈ యుద్ధంలో లక్ష మంది దాకా మరణించారు. గొటాబయ రాజపక్సె మద్దతుదారులు ఇద్దరు రాజపక్సెల ఫొటోలను విజయోత్సవ ప్రదర్శనల్లో ప్రదర్శించారు. భయానక ఈస్టర్‌ దాడుల తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో మొత్తం 83.7 శాతం ఓట్లు పోలయ్యాయి. రాజపక్సె అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్రధాని మోడి శుభాకాంక్షలు

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గోటబయ రాజపక్సకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు, ఇరు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు, పౌరుల శ్రేయస్సు, భద్రత కోసం కలిసి ముందుకు సాగుదామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలను ప్రశాతంగా, విజయవంతంగా నిర్వహించుకున్నందుకు శ్రీలంక ప్రజలకు కూడా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. మోడీ ట్వీట్‌కు ప్రతిగా రాజపక్స కూడా ట్వీట్‌ చేశారు. శుభాకాంక్షలు తెలిపినందుకు మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/