రాజధానిపై సీఎం జగన్‌ పంజా విసరడం ఖాయం

Gorantla Butchaiah Chowdary
Gorantla Butchaiah Chowdary

అమరావతి: రాజధాని మార్పుపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ముఖ్యమంత్రి జగన్‌ రాజధాని ప్రకటనను వాయిదా వేశారని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిపై సీఎం జగన్‌ పంజా విసరడం ఖాయమని బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజధానుల పేరుతో సీఎం రాక్షస క్రీడకు తెరతీశారని ఆయన దుయ్యబట్టారు. బోస్టన్‌ గ్రూపు అవినీతిపై విదేశాల్లో విచారణ జరుగుతోందన్నారు. రాజమండ్రిలో వారసత్వంగా వస్తున్న భూమిని 7 ఎకరాలు అమ్మి 2015 ఫిబ్రవరిలో అమరావతిలో 2.96 ఎకరాల భూమి కొనుగోలు చేశానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి తాత గుమస్తాగా ఉన్నప్పుడే తాను 60 ఎకరాల భూస్వామినని గోరంట్ల చెప్పారు. టిడిపి మహిళా నేతల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు నోరు అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల హెచ్చరించారు. తాడేపల్లిలో సీఎం కట్టుకున్న భవనం ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అయితే తనది కూడా అదేనని బుచ్చయ్య చౌదరి అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/