గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై మూడు రోజులే!

కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడ్డారు. అయితే లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేయడంతో చాలా వరకు కంపెనీలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు పరిగెత్తడం మొదలుపెట్టారు. అయితే కొన్ని సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఎక్కువ లాభాలను గడించాయి. దీంతో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇస్తూ వస్తున్నాయి.

ఈ జాబితాలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఉంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తమ సంస్థలోని ఉద్యోగులకు గూగుల్ ఒక గుడ్ న్యూస్‌ను చెప్పింది. ఇకపై వారంలో మూడు రోజులు మాత్రమే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయొచ్చని, మిగతా రెండు రోజులు వారి ఇష్టమని స్పష్టం చేసింది. ఉద్యోగులు కావాలంటే ఆ రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చని గూగుల్ సంస్థ పేర్కొంది.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయమని ఆ సంస్థ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించే సంస్థల్లో వారు తమ పూర్తి సామర్థ్యంతో పనులు చేస్తారని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.