రైలు పట్టాలను తొలగించిన మావోలు

GOODS
GOODS

రైలు పట్టాలను తొలగించిన మావోలు

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా భాంసీ-బచేలీ మధ్య రైలు పట్టాలను మావోయిస్టులు బుధవారం రాత్రి తొలగించారు. దీనితో గూడ్స్‌ రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటన స్థలంలో రైల్వే సిబ్బంది వద్ద నుంచి వాకీటాకీని మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. కెకె రైలు మార్గంలోని కిరండోల్‌ సెక్షన్‌లో భాంసీ-బచేలీ మధ్య 432వ పోల్‌ వద్ద ఈ సంఘటన జరిగింది. వెంటనే రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రైలు పట్టాలకు మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల కాలంలో రైలు పట్టాలను నక్సల్స్‌్‌ తొలగించడం నెల వ్యవధిలో రెండోసారి. ఈ మధ్యన నక్సల్స్‌ బంద్‌ నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. నక్సల్స్‌ శిక్షణా శిబిరం ధ్వంసం: బీజాపూర్‌ జిల్లాలోని గంగులూరు, మిర్తూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో గురువారం వేర్వేరు ఎన్‌కౌంటర్లు జరిగాయి. నక్సల్స్‌ పారిపోగా సంఘటనా స్థలాన్ని భద్రతాబలగాలు పరిశీలించగా అక్కడ నక్సల్స్‌ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తేలింది. వెంటనే వాటిటి భద్రతాబలగాలు ధ్వంసం చేశాయి. గంగులూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దపాల్‌, మిర్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేచాపాల్‌ అటవీప్రాంతాల్లో ఆ ప్రాంత దళకమాండర్‌ విజ్జా సంచరిస్తున్నట్లుగా భద్రతాబలగాలకు సమాచారం అందింది. వెంటనే ఎస్టీఎస్‌, డీఆర్‌జీ బలగాలు 200 మంది ఆ ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి.

ఎత్తైన పర్వతాల్లో పెద్దపాల్‌, బేచాపాల్‌ అటవీప్రాంతాల మధ్య నక్సల్స్‌ను భద్రతాబలగాలు గుర్తించాయి. అయితే నక్సల్స్‌ వీరి రాకను గమనించి 35 నుంచి 40 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. భద్రతాబలగాలు సైతం 30 రౌండ్లకు పైగా కాల్పులు జరిపాయి. ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ ఎదురుకాల్పుల సంఘటనను పరిశీలించిన భద్రతాబలగాలకు అక్కడ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. వెంటనే వాటిని ధ్వంసం చేశారు. బీజాపూర్‌ ఎస్పీ మోహిత్‌గర్గ్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. =