2023 బడ్జెట్ లో మత్స్యకారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..

పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో మత్స్యకారులకు తీపి కబురు అందించారు. మత్స్యశాఖకు రూ.6వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ తెలిపారు. రైతులకు 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు డైరీ, మత్స్య శాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పీఎం మత్స్య సంపద యోజన కోసం అదనంగా 6 వేల కోట్లను కేటాయిస్తున్నామన్నారు.

అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగులు నిర్మిస్తామన్నారు. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు రైతులకు అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే దేశంలోని 50 విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. రైల్వేకు 2.40 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజనకు 79 వేల కోట్ల కేటాయింపు, కరువు ప్రాంత రైతులకు 5.300 కోట్ల కేటాయింపు, క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు 2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

అలాగే ప్రజల సంక్షేమానికే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రపంచమంతటా మందగమనం ఉన్నప్పటికీ మన దేశంలో వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉందని మంత్రి నిర్మల చెప్పారు. కరోనా కష్టాల నుంచి వేగంగా తేరుకుంటున్నామని, ఈ ఏడాదితో వాటన్నింటినీ గట్టెక్కుతామని తెలిపారు. ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.