తెలంగాణ రైతులకు శుభవార్త

రబీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Farmers
Farmers

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. త్వరలోనే రబీ సీజన్ కోసం రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం 12,862 కోట్లు కేటాయించగా ఖరీఫ్‌లో రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. తాజాగా రబీలో అందించేందుకు రూ.5,100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయ పరిపాలనాశాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందించనుంది. ఆ వివరాలు అందించిన వెంటనే ఆర్థికశాఖ ఆ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/