విద్యార్థులకు తీపి కబురు తెలిపిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యార్థులకు తీపి కబురు తెలిపారు. విద్యా కానుకలో భాగంగా వచ్చే ఏడాది నుండి స్పోర్ట్స్‌ షూ, స్పోర్ట్స్‌ డ్రస్‌ అదనంగా ఇస్తామని తెలిపారు. మంగళవారం విద్యాశాఖ లో నాడు–నేడు, పౌండేషన్‌ స్కూళ్లు పై జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలు పై అన్ని రకాలుగా సిద్ధంకావాలని..పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచడంతో పాటు, కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

వెయ్యి స్కూళ్ల‌ను సీబీఎస్‌ఈ అఫిలియేషన్ చేస్తున్నామ‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. అన్ని రకాల స్కూళ్లు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐసీఎస్‌ఈ అఫిలియేషన్ మీద కూడా దృష్టిపెట్టాలన్నారు. రెండో విడ‌త నాడు-నేడు టెండ‌ర్ల ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.

తల్లిదండ్రులు, విద్యార్థుల ఆనందోత్సాహాల నడుమ ‘జగనన్న విద్యా కానుక’ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందజేసే ఈ పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక కిట్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో ఇతర వస్తువులను పొందుపరిచారు. ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు(క్లాత్‌), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. ఇక వచ్చే ఏడాది వీటితో పాటు స్పోర్ట్స్‌ షూ, స్పోర్ట్స్‌ డ్రస్‌ అదనంగా రానున్నాయి.