గోదావరి, పెన్న అనుసంధానంలో తొలి అడుగు

Godavari River
Godavari River

గోదావరి, పెన్న అనుసంధానంలో తొలి అడుగు

4,600 కోట్లతో ‘మహా సంగమం’కు టెండర్లు

రాజంపేట : నదుల అనుసంధానంలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి తాజాగా మరో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. నదుల అనుసంధానంలో కేంద్రప్రభుత్వానికి విజన్‌వున్నా రాజకీయకారణాలతో రాష్ట్రంలో సుమారులక్షకోట్ల వ్యయంతో గోదావరి – కృష్ణా నదుల అనుసందాన ప్రాజెక్టులకు ముందడుగు పడ లేదు. కేంద్రప్రభుత్వం నదుల అనుసంధానానికి కార్యాచరణ సిద్దం చేసే ప్రక్రియలో వుండగానే పట్టిసీమ పూర్తిచేసి నదుల అనుసంధాన విష యంలో మీ కంటే ముందు మేమున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరూపించారు.

మిత్రపక్షంలో వుండగా పట్టిసీమ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం నుంచి అభినందనల వర్షం కురిసింది. నదుల అను సందానంలో ఆంధ్రరాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే వేగంతో గోదావరి-కృష్ణానదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్దం చేసేందుకు వ్యాప్కోస్‌కు అప్పగించింది. దీని కోసం 3.6 కోట్లు నిధులు కూడా మంజూరు చేసింది.అయితే ఎన్డీయే కూటమి నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రప్రభుత్వం మంజూరు చేసే నిధుల కోసం వేచి చూడకుండా అందుబాటులో వున్న నిధులతో నదుల అనుసంధానానికి నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో 4వేల కోట్ల నిధులు కూడా ఈ ప్రాజెక్టుకు కేటాయించింది.

తాజాగా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు టెండర్లు కూడా ఆహ్వానించి కేంద్రానికి సవాలు కూడా విసిరింది. అంతటితో ఆగకుండా ఏకంగా పనులు చేపట్టేందుకై ప్రాథమిక నివేదిక సిద్దం చేసి ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ టెండర్లు కూడా ఆహ్వానిస్తూ టెండర్‌ నోటీఫికేషన్‌ (టెండర్‌ నోటీస్‌ నెంబర్‌ 33,34-2018-19)జారీ చేసింది. ఇపిసి పద్ధతిలో మహా సంగమం ప్రాజెక్టును చేపట్టేందుకు రెండు ప్యాకేజీలుగా పనులను విభజించింది.

మొదటి ప్యాకేజి (1/ఐజిపిఆర్‌/ జిఎన్‌టి/2018-19) 2100కోట్లు, రెండో ప్యాకేజి (2/ఐజిపిఆర్‌/ జిఎన్‌టి2018-19) 2500 కోట్ల వ్యయంతో పనులను చేపట్టనుంది. గోదావరి- పెన్నా నదుల అనుసందానంలో భాగంగా పేజ్‌-1లో ప్రాజెక్టు సమగ్ర నివేదిక, డిజైన్లు, ఎత్తి పోతల పథకం నిర్మాణం చేపట్టాల్సి వుంది. అలాగే 7వేల క్యూసెక్కుల నీటిని హరిశ్చంద్రపురం వద్ద కృష్ణానది నుంచి నాగార్జునసాగర్‌ కాలువలో నకిరకల్లు వద్ద 80వ కిలోమీటర్‌ వద్ద ఎత్తిపోసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పంప్‌ హౌస్‌లను నిర్మించనున్నారు. హైడ్రోమెకానికల్‌ పనులను చేయను న్నారు. ఎలక్ట్రో మెకానికల్‌ పనులుకూడా ఈ రెండు ప్యాకేజీల్లో చేపట్టను న్నారు. పైపు లైన్లను నిర్మిస్తారు. 5 సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 4 నుంచి ఈ టెండర్లకు సంబంధించి గుత్తేదారులకు పత్రాలను అందుబాటులోకి తెస్తారు.