విదేశీ టూరిస్ట్‌పై గోవాలో కత్తితో దాడి..లైంగిక వేధింపులు

మహిళ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

Goa hotel employee attacks woman tourist from Netherlands with knife, arrested

పనాజీ: గోవా పర్యటనకు వచ్చిన ఓ విదేశీ టూరిస్ట్‌పై స్థానిక హోటల్‌లో లైంగిక దాడి జరిగింది. భారత పర్యటనకు వచ్చిన ఓ నెదర్‌లాండ్స్ మహిళపై గోవా బస చేసిన హోటల్‌‌లో ఉద్యోగి ఒకరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఆపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూరీకో అనే నెదర్‌లాండ్స్ మహిళ ఉత్తర గోవాలోని పెర్నెమ్‌ ప్రాంతంలో గల ఓ హోటల్‌లో బస చేశారు. అయితే.. అదే హోటల్‌లో పని చేసే అభిషేక్ వర్మ మంగళవారం రాత్రి ఆమె గదిలోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు.

బాధితురాలు భయంతో కేకలు వేయడంతో స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి అతడిని అడ్డుకున్నారు. దీంతో..అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిందితుడు మళ్లీ రాడని అనుకుంటున్న తరుణంలో కత్తి తీసుకుని వచ్చిన అతడు తనను అడ్డుకున్న వ్యక్తితోపాటూ మహిళపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన వాడని, గత రెండేళ్లుగా అతడు అదే హోటల్‌లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.