రెండు వేర్వేరు టీకాలు తీసుకున్నజ‌ర్మ‌నీ చాన్స్‌ల‌ర్‌

మొద‌టి డోసు ఆస్ట్రాజెనెకా.. రెండో డోసు మోడెర్నా తీసుకున్న ఏంజెలా మెర్కెల్

బెర్లిన్‌: జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ రెండు వేర్వేరు కోవిడ్‌ టీకాలు తీసుకున్నారు. మొదటి డోస్‌లో భాగంగా ఆస్ట్రాజెనికా తీసుకున్న ఏంజెలా రెండో డోసులో భాగంగా మోడర్న టీకా తీసుకున్నారు. మంగ‌ళ‌వార‌మే ఆమె రెండో డోసు తీసుకున్న‌ట్లు ఆమె అధికార ప్ర‌తినిధి ఒక‌రు వెల్ల‌డించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ల వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ క‌డుతోంద‌ని చాలా యురోపియ‌న్ దేశాలు ఈ వ్యాక్సిన్‌పై తాత్కాలిక నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. జ‌ర్మ‌నీ కూడా 60 ఏళ్లు పైబ‌డిన వాళ్ల‌కే ఈ వ్యాక్సిన్‌ను ప‌రిమితం చేసింది. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ పూర్తి స్థాయిలో ఈ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. ఇక‌ తొలి డోసు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు రెండో డోసుగా మరో వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌నీ జ‌ర్మ‌నీ ప్ర‌క‌టించింది.

జ‌ర్మ‌నీతోపాటు ప‌లు యురోపియ‌న్ దేశాలు కూడా ఇలా వ్యాక్సిన్ మిక్సింగ్‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. తొలి డోసు ఒక వ్యాక్సిన్‌, త‌ర్వాతి డోసు మ‌రో వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌కత మ‌రింత మెరుగైన‌ట్లు ప‌లువురు నిపుణులు కూడా చెబుతుండ‌టంతో వ్యాక్సిన్ మిక్సింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఏకంగా దేశాధినేత‌లే వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/