నిత్యస్ఫూర్తి ప్రేరకం జార్జిరెడ్డి

నేడు జయంతి

GeorgeReddy(File)

అడుగడుగునా పోరాటం గురించి నేర్చుకో మంటూ తెలుగునేలపై ఉస్మానియా కేంద్రంగా ఒక నినాదం జనించింది. ఇక్కడ జన్మించిన ఈ నినాదం విత్తనంగా మారి పంటను వాగ్దానం చేసింది.

ఒక నినాదానికి ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉంటుందనే అక్షరసత్యాన్ని నిజం చేస్తూ వేలాది మందిని చైతన్యం చేసింది.

ఈ నినాదం ఎవరి ఆశయాలకు, ఆకాంక్షలకు, అభివృద్ధికి, ప్రతిబింబలుగా ఉంటాయనే ప్రాతిపదికపై ఆ నినాదం వెలుగురేఖలు నిర్మితమవ్ఞతాయి.

ఆ విధంగా ఉస్మానియా యూనివర్శిటీ కేంద్రంగా సుమారు 48 ఏళ్ల క్రింద ఈ నినాదం పుట్టింది. ఆధిపత్యం, దోపిడీ, అసమాన సమాజంపై పోరు సలిపింది.

వందలాది విద్యార్థులను విప్లవ మార్గం వైపు నడిపించింది. ఆ పరంపర నేటికీ కొన్ని హెచ్చుతగ్గులతో కొనసాగుతూనే ఉంది.

ఒక నినాదం యువతపై అంతటి ప్రభావం చూపగలిగిందంటే ఆ గొప్పతనం నినాదనిదేకాదు, ఆ నినాదాన్నిచ్చిన జార్జిరెడ్డి వ్యక్తిత్వానిది కూడా.

జార్జిరెడ్డి 1947 జనవరి 15న కేరళలో పుట్టి తమిళనాడులో పెరిగారు.

అమ్మ,నాన్న లీలా వర్గీస్‌, రఘునాథరెడ్డి, తండ్రి వృత్తి బాధ్యతలు రీత్యా తెలుగు నేలపై అడుగుపెట్టాడు. అప్పటి నుంచి సమాజాన్ని కొత్తగా అధ్యయనం చేయడం ప్రారంభించారు.

జార్జిరెడ్డి రాజకీయ అవగాహనకు ఈ నేల మట్టివాసనలను అద్దింది. తాత్త్విక చింతనను అందించింది.

ఎం.బి.బి.ఎస్‌ చదివి డాక్టర్‌ కావాలన్న తన కోరిక కోరికగానే మిగిలిపోయిన సందర్భంలో సమాజంలోని వ్యవస్థీకృత దోపిడీ, వివక్షత, ఆధిపత్యాలను నయం చేసే విప్లవ విద్యార్థి ఉద్యమానికి ఆద్యుడిని చేసింది.

బలహీనుల పట్ల బలంగా నిలబడాలనే కాంక్షనే జార్జిరెడ్డిని హైదరాబాదు చే గువేరాగా మల్చింది. మతోన్మాదం, అరాచకత్వం, ఆధిపత్యం, జడలల్లుకున్న ఉస్మానియా యూనివర్శిటీలో వాటిని చీల్చే అరుణతారగా చేసింది.

ఉన్మాదదాడులను తిప్పి కొట్టే సాహసికుడ్ని అంతరాలు లేని సమాజాన్ని కాక్షించే బలమైన విద్యార్థి నాయకు డిగా రూపొందించింది. చిన్నతనం నుంచి చదువ్ఞలో జార్జి ముందుండేవారు.

విషయాలను హేతుబద్ధంగా ఆలోచించడం, అర్థం చేసుకోవడం, పాఠ్యాంశంలోని సందేహాలను నిర్భయంగా అడుగులూ, వాటిని విభిన్న కోణాల్లో చర్చించేవాడు.

అదే క్రమంలో ఉన్నత విద్యకోసం ఉస్మానియా యూనివర్శిటీ ఆవరణలోకి అడుగుపెట్టిన జార్జి, ఇక్కడి భౌతిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ, అన్వయించుకున్నాడు.

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యా ర్థులపై ఉన్నత వర్గానికి చెందిన విద్యార్థులు చేసే దాడులను, అవ మానాలను, అవహేళ లను గమనించేవాడు.

వాటికిదీటుగా సమా ధానం ఇచ్చేవాడు. మరోపక్క అకడమిక్‌ పుస్తకాలతో పాటుగా, నాన్‌ అకడమిక్‌ పుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేసేవాడు.

అదే సమయంలో పేద, ధనికవర్గ అంతరాలను, పేదలు ఎదుర్కొనే సమస్యలను నిశితంగా గమనిస్తూ ఉండేవాడు.

వాటి నిర్మూలనకై మేధోమధనం, మిత్రబృందంతో కలిసి స్టడీ సర్కిల్స్‌, చర్చోప చర్చలు నిర్వహించేవారు.

అప్పటికే సామ్రాజ్యవాద దేశాలతో పోరాటం చేస్తున్న చేగువేరా, నక్సల్సరీ శ్రీకాకుళం ఉద్యమాలు జార్జిరెడ్డిపై తీవ్రంగా ప్రభావం చేసాయి.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అనేక ఉద్యమాల ప్రభావంతో ఉస్మానియా యూనివర్శిటీ కేంద్రంగా ఒక విద్యార్థి మేధోవర్గాన్ని తయారు చేశాడు.

దేశంలోని, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై సైద్ధాంతికంగా విశ్లేషణలు జరిపారు.

రైతులు, కార్మికులు, కర్షకుల సమస్యలపై మాట్లాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేశాడు. సామాజిక, రాజకీయ విధానాలపై కేంద్ర,రాష్ట్రాలను ప్రశ్నించేవారు. చర్చకుపెట్టేవాడు.

విద్యార్థి ఉద్యమ రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం అయ్యేంతగా విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేసాడు.

యూనివర్శిటీ విద్యార్థుల సమస్యలపై ఆధిపత్య ఉన్మాద మూకలతో నిత్యం పోరాటం చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విద్యార్థి ఉద్యమాలను నిర్మించాడు.

విద్యార్థి ఉద్యమాల ద్వారా సామాజిక అవగాహన పొందిన విద్యార్థులంతా జార్జిరెడ్డితో సహజంగానే కలిసి వచ్చారు.

అప్పటి వరకు ఉన్న ఉన్నతవర్గ విద్యార్థుల ఆధిపత్య, ఆగడాలకు జార్జిరెడ్డి ఇచ్చిన చైతన్యంతో అడ్డుకట్టపడింది.

వాళ్ల ఆధిపత్యానికి బీటలు పారాయి. యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లో ముందుండి ఎన్నికల్లో జార్జిరెడ్డి బలపరిచిన వ్యక్తులు గెలుపొందడంతో జార్జిరెడ్డిని భౌతికంగా నిర్మూలిస్తే గాని తమ ఆగడాలు, ఆకృత్యాలు సాగవనే నిర్ణయానికి వచ్చారు.

పథకం ప్రకారంగా మతోన్మాదులు కలిసి ప్రగతిశీల విద్యార్థుల ప్రియతమ నాయకున్ని హత్యచేశాయి.

జార్జిరెడ్డిని హత్య జరిగిన సుమారు 47 ఏళ్ల తర్వాత జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్‌ జీవన్‌ రెడ్డి సినిమా తెరకెక్కించారు.

జార్జిరెడ్డి మరణం ఇప్పటికీ మతోన్మాదులని వణికిస్తోంది. యపెడుతోంది.

జార్జిరెడ్డిని ఆయన భావజాల వారసులే గాక సాధారణ విద్యార్థి, ప్రజలు నేటికి రించుకుంటున్నారు.

చైతన్యవంతమైన సమాజాన్ని కలగన్న విద్యార్థి నాయకున్ని స్ఫూర్తిగా, ప్రేరణ పొంది సమాజంలో తమవంతు పాత్రను భిన్నారంగాల్లో నిర్వహిస్తున్నారు.

సమాజంలో దోపిడీ, అణచివేత, అసమానతలు ఉన్నంతకాలం జార్జిరెడ్డి చైతన్యం నిత్యం వెలుగునిస్తూనే ఉంటుంది.

జార్జిరెడ్డి ప్రజానీకంలో సజీవంగా, శాశ్వతంగా వర్దిల్లుతాడు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణమే జార్జిరెడ్డికి నిజమైన నివాళి.

  • గడ్డం శ్యామ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/