బ్రిటన్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు

650 స్థానాలకు 3,300 మంది పోటీ

Boris Johnson
Boris Johnson

లండన్‌ : బ్రిటన్‌లో ఈరోజు సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమయింది. ఇవి నాలుగేళ్ల వ్యవధిలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు. మొత్తం 650 స్థానాలకు గాను 3,322 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు గురువారం నాటి పోలింగ్‌లో.తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌)లో 326 స్థానాలు గెల్చుకున్న పార్టీకి ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. అక్టోబర్‌లో ఎన్నికలు ప్రకటించిన నాటినుండి ఇప్పటి వరకూ దాదాపు 31 లక్షల మంది ఓటర్లు తాజాగా తమ పేర్లను నమోదు చేయించుకోవటం విశేషం. ఇందులో 20 లక్షల మంది 35 ఏళ్లలోపు వారు కాగా మరో 10 లక్షల మంది 25 ఏళ్ల లోపు యువ ఓటర్లు.

ఎన్నికల ఫలితాలపై వీరి ప్రభావం గణనీయంగానే వుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి, ప్రతిపక్ష నేత జెరిమీ కార్బిన్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీకి ప్రధాన పోటీ వుంది. ఇప్పటి వరకూ వెలువడిన ఒపీనియన్‌ పోల్స్‌లో కన్జర్వేటివ్‌లకు 43 శాతం, లేబర్‌ పార్టీకి 32 శాతం ఆధిక్యత లభించవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. 13 శాతం ఓట్లతో లిబరల్‌ డెమొక్రాటిక్స్‌ నాలుగోస్థానంలోనూ, చెరి 4 శాతం ఓట్లతో బ్రెగ్జిట్‌ పార్టీ, స్కాటిష్‌ నేషనల్‌ పార్టీలు తరువాతి స్థానాల్లో నిలుస్తాయని ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేశాయి.బ్రిటన్‌ పాలకవర్గాలు ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీని, జెరిమి కార్బిన్‌ను అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/