శుక్రవారం బ్రార్ స్క్వైర్ శ్మ‌శాన వాటిక‌లో బిపిన్ రావ‌త్ అంత్య‌క్రియ‌లు

శుక్రవారం బ్రార్ స్క్వైర్ శ్మ‌శాన వాటిక‌లో బిపిన్ రావ‌త్ అంత్య‌క్రియ‌లు

భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ , ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. బిపిన్ రావత్ మృతి పట్ల సినీ , రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇక బిపిన్ రావ‌త్ అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం నిర్వహించబోతున్నారు. గురువారం సాయంత్రం బిపిన్ రావ‌త్ పార్థివ దేహాన్ని సైనిక విమానంలో ఢిల్లీకి త‌ర‌లించ‌నున్నారు. శుక్ర‌వారం ఆయ‌న నివాసంలో భౌతిక‌కాయాన్ని ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు సంద‌ర్శ‌న‌కు ఉంచ‌నున్నారు. అనంత‌రం బ్రార్ స్క్వైర్ శ్మ‌శాన వాటిక‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. అయితే ఈ ప్ర‌మాదానికి ముందు ఏం జ‌రిగింది? అస‌లు ఢిల్లీ నుంచి కూనూరుకు బిపిన్ రావ‌త్ ఎందుకు బ‌య‌ల్దేరారు? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

బుధ‌వారం ఉద‌యం ఢిల్లీ నుంచి డిఫెన్స్ విమానంలో కోయంబ‌త్తూరులోని సూలూరు ఎయిర్‌బేస్‌కు సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులికా రావ‌త్ స‌హా 9 మంది ఆర్మీ ఆఫీస‌ర్లు బ‌య‌ల్దేరారు. సూలూరు ఎయిర్‌బేస్ నుంచి కూనూరు కంటోన్మెంట్‌కు ఆర్మీ హెలికాప్ట‌ర్‌లో బిపిన్ రావ‌త్ దంప‌తులతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీస‌ర్లు బ‌య‌ల్దేరారు. ఇక కూనూరు ఎయిర్‌బేస్‌లో మ‌రో 5 నిమిషాల్లో హెలికాప్ట‌ర్ ల్యాండ్ అయ్యే కంటే ముందే చాప‌ర్ కుప్ప‌కూలిపోయింది. స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన‌ట్లు ఆర్మీ అధికారులు ధృవీక‌రించారు.