హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్!

టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు

హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతారనుకున్న పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పంపడంతో, అక్కడి నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారన్న చర్చకు ఫుల్‌స్టాప్ పడింది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్‌లో ఈ నెల 16న కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాతి నుంచి నియోజకవర్గంలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఉద్యమ నేపథ్యం అంతగాలేని కౌశిక్‌రెడ్డిని పోటీ చేయించటం సరైన నిర్ణయం కాకపోవచ్చని సీఎం కేసీఆర్‌ వెనక్కి తగ్గి ఉండవచ్చు’ అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు. ఇక టికెట్‌ హామీ నెరవేర్చలేకపోయినందుకే కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉంటారని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈటలపై పోటీకి బీసీ అభ్యర్థిని బరిలో దించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. కాగా, ఉద్యమ నేపథ్యం లేకపోవడం వల్లే కౌశిక్ రెడ్డిని పక్కనపెట్టి ఎమ్మెల్సీగా పంపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/