డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు: సవాంగ్

2 ఏళ్ల 8 నెలల పాటు డీజీపీగా పని చేశాను..నా 36 ఏళ్ల పోలీసు సర్వీసు ఈరోజుతో ముగుస్తోందిగౌతమ్ సవాంగ్

అమరావతి : ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ పదవీకాలం నేటితో ముగిసింది. ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కొత్త డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ లో సవాంగ్ కు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు సవాంగ్ మాట్లాడుతూ, ఈరోజుతో తన 36 ఏళ్ల పోలీస్ సర్వీసు ముగుస్తోందని అన్నారు. డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల పాటు పని చేశానని… సీఎం సూచనలతో బాధ్యతలను నిర్వహించానని చెప్పారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, మార్పులు తెచ్చేందుకు కృషి చేశానని తెలిపారు.

దిశ మొబైల్ యాప్ ద్వారా కూడా కేసులు నమోదయ్యేలా చేశామని చెప్పారు. డిజిటల్ గా ఫిర్యాదు చేసే వెసులుబాటును తీసుకొచ్చామని సవాంగ్ తెలిపారు. 36 శాతం కేసులు డిజిటల్ గానే వచ్చాయని చెప్పారు. 75 శాతం కేసుల్లో కోర్టులు శిక్ష విధించాయని అన్నారు. పోలీస్ వెబ్ సైట్ ద్వారా డిజిటల్ గా ఎఫ్ఐఆర్ లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించామని చెప్పారు. డీజీపీ కార్యాలయం నుంచి ఇన్స్ పెక్టర్ కార్యాలయం వరకు డిజిటల్ గా అనుసంధానం చేశామని తెలిపారు. తనను డీజీపీగా కొనసాగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/