ఏపి కొత్త డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌!

Gautam Sawang
Gautam Sawang

అమరావతి: ఏపికి కొత్త డీజీపిగా దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ నియమితులు కానున్నారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సవాంగ్‌ 1963 జులై 10న జన్మించారు. ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు.ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుశాఖపరంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన సందర్శించి అధికారులతో సమీక్షించారు. గతేడాది జులై 1న ఆర్‌.పి.ఠాకూర్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 11 నెలలుగా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సవాంగ్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/