జూ. ఎన్టీఆర్ , రామ్ చరణ్ లపై గరికపాటి నరసింహారావు ప్రశంసలు

గరికపాటి నరసింహారావు పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ఫై పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన గరికపాటి..ఇప్పుడు జూ ఎన్టీఆర్ , రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు. జూ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ టాక్ పరంగానే కాదు వసూళ్ల పరంగా , అవార్డ్స్ పరంగా కూడా సత్తా చాటింది. ఇక ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది.

ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ , జూ ఎన్టీఆర్ , ఎస్.ఎస్.రాజమౌళి పేర్లు మారుమోగిపోతున్నాయి. ఇక ఈనెల 13న 95వ అకాడమీ అవార్డులను ప్రకటించనున్నారు. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటున్న వారిలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు కూడా ఉన్నారు.

తన ప్రవచనంలో భాగంగా ఇటీవల గరికపాటి నరసింహారావు ‘నాటు నాటు’ పాట గురించి ప్రస్తావించారు. ‘అచ్చ తెలుగులో రాసిన పాటకు ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటన కారణంగా, కీరవాణి సంగీతం కారణంగా, రాజమౌళి దర్శకత్వం కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది. నాకు నిన్నటి వరకు ఆ పాట గురించి తెలీదు. మా అబ్బాయి పిలిచి ఆ పాటేంటో పెట్టరా అని అరగంట కూర్చొని విన్నాను. ఎందుకంత స్థాయికి వెళ్లిందో తెలుసుకోవాలి కదా. అచ్చ తెలుగు పాట.. ఇంగ్లిష్ మాటలు లేవు. రాసిన చంద్రబోస్‌కి నమస్కారం. చాలా మంచి పాట రాశారు’ అని గరికపాటి ప్రశంసించారు.

ఆస్కార్ పురస్కారానికి ప్రతిపాదింపబడటమే గొప్ప విషయమని.. భగవంతుడి దయవల్ల మార్చి 13వ తేదీన పురస్కారం వస్తే మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని గరికపాటి అన్నారు. ‘పురస్కారం రావాలని కాంక్షిద్దాం. సరస్వతీ దేవిని పూజిద్దాం. గుడిలోకి వెళ్తే దండం పెట్టండి పురస్కారం రావాలని. మనమంతా గర్వంగా తిరుగుతాం’ అని గరికపాటి తన అనుచరులకు సూచించారు.