గంటా రాజీనామా లేఖను శాసనసభ కార్యదర్శికి అందజేత

అమరావతి: టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా ఇటీవల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజాగా, స్పీకర్ ఫార్మాట్‌లో నిన్న శాసనసభ కార్యదర్శికి లేఖను పంపారు. విశాఖ జర్నలిస్ట్స్ ఫోరం (వీజేఎఫ్) ప్రతినిధులు ఆ లేఖను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యలుకు అందజేశారు. దీంతో పాటు గంటా రాసిన మరో లేఖను కూడా ఆయనకు అందజేశారు. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశానని, ఇంకేమైనా సమాచారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని గంటా ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, వీజేఎఫ్ ప్రతినిధుల నుంచి గంటా రాజీనామా లేఖను తీసుకోవడానికి ముందు నాలుగు గంటలపాటు హైడ్రామా నడించింది.

రాజీనామా లేఖను ఇవ్వాల్సింది తమకు కాదంటే, తమకు కాదంటూ శాసనసభ సిబ్బంది వీజేెఎఫ్ ప్రతినిధులను నాలుగు గంటలపాటు తిప్పించుకున్నారు. దీంతో గంటా జోక్యం చేసుకుని బాలకృష్ణమాచార్యులుతో ఫోన్‌లో మాట్లాడడంతో నాలుగు గంటల తర్వాత లేఖను తీసుకున్నారు. కాగా, రాజీనామా చేస్తున్నట్టు గంటా ప్రకటించిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. రాజీనామా నిర్ణయంపై గంటాను ప్రశ్నించగా, తాను అందుకే కట్టుబడి ఉన్నట్టు గంటా స్పష్టం చేసినట్టు తెలిసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/