మంత్రులు రాజీనామా చేస్తే టీడీపీ పోటీ పెట్టదు..గంటా

సీఎం కార్యాచరణ ప్రకటించాలని వినతి

విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఏపీ మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మంత్రులు రాజీనామా చేసి వస్తే… ఉప ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థులను నిలపబోదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం అభిప్రాయం ఏంటో స్పష్టంగా తెలిసిందని, దీనిపై సీఎం కార్యాచరణను ప్రకటించాలని గంటా కోరారు.

అటు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తన వైఖరి ఏంటో చెప్పాలని, కార్మికుల పక్షాన పవన్ పోరాడితే బాగుంటుందని అన్నారు. ఢిల్లీలో పాదయాత్రకు టీడీపీ సిద్ధంగా ఉందని, అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీఎంతో కలిసి పనిచేసేందుకు చంద్రబాబు కూడా తన సంసిద్ధతను ఇప్పటికే వ్యక్తం చేశారని గంటా వివరించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసేందుకు ప్రధానంగా బీజేపీ నేతలు తమ వంతు కృషి చేయాల్సి అవసరం ఉందని నొక్కి చెప్పారు.

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెలిబుచ్చిన వెంటనే గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/