మౌనిక కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాః జీహెచ్ఎంసీ మేయర్

జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం.. సిబ్బంది పై చర్యలు తీసుకుంటాం..గద్వాల విజయలక్ష్మి

gadwal-vijayalakshmi-announced-an-ex gratia-of-rs-2-lakh-to-maunika-family

హైదరాబాద్‌ః సికింద్రాబాద్‌లోని కళాసిగూడ నాలాలో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. చిన్నారి మౌనిక మృతిపట్ల మేయర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత బాలిక కుటుంబాన్ని గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అక్కడ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని గద్వాల విజయలక్ష్మి తెలిపారు. మ్యాన్‌హోల్స్ మూసేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని కోరారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ వైపు నుంచి చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భరోసా ఇచ్చారు.