ఈరోజు అర్ధరాత్రి నుండి గ‌డ్డి అన్నారం పండ్ల మార్కెట్ మూతవేత

కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ అంటే తెలియని వారుండరు. దాదాపు 36 ఏళ్లుగా ఇక్కడ పండ్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అలాంటి పండ్ల మార్కెట్ ఇప్పుడు మూతపడనుంది. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను పెద్ద అంబర్‌పేట మండలం కోహెడ గ్రామానికి తరలిస్తున్నారు. ఈరోజు అర్ధ‌రాత్రి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కు దానికి తాళాలు వేసేస్తామ‌ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుండి బాటాసింగరంలోని లాజిస్టిక్ పార్క్ లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఉన్న మార్కెట్ స్థలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణo చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

గడ్డి అన్నారం మార్కెట్ కొన్ని ఎకరాల్లోనే ఉండ‌డంతో పాటు అది దశాబ్దాల కిందటి నిర్మాణం కావడంతో అందులో సదుపాయాలు లేవ‌ని ప్ర‌భుత్వం అంటోంది. అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో వ‌ర్త‌కులు, హ‌మాలీలు ఆందోళ‌న బాట‌ ప‌ట్టారు. త‌మ‌తో చ‌ర్చించ‌కుండానే అధికారులు నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని చెప్పారు. 35 ఏళ్ల పాటు గ‌డ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని గుర్తు చేసుకున్నారు. ఈనెల 25వ తేదీ రాత్రి నుండి కొత్తపేట మార్కెట్ బంద్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చే రైతులు ముందుగానే మార్కెట్ కు చేరే విధంగా చూసుకోవాలని, రైతులు, ఏజెంట్లు మరియు హమాలీలు సహకరించాలని కోరారు.