ఇక రెస్ట్​ తీసుకోండి..వనమా గారు మీకు వయసైపోయింది – హెల్త్​ డైరెక్టర్ శ్రీనివాసరావు

స్టేట్​ హెల్త్​ డైరెక్టర్, డాక్టర్ ​జీఎస్సార్ ​ట్రస్ట్​ చైర్మన్ ​గడల శ్రీనివాసరావు..కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఓ సలహా ఇచ్చారు. మీకు 80 ఏండ్లు వచ్చాయి, వయసైపోయింది, నియోజకవర్గానికి చాలా చేశారు. ఇక రెస్ట్​ తీసుకోండి అంటూ సూచించారు. గత కొద్దీ రోజులుగా హెల్త్​ డైరెక్టర్ శ్రీనివాసరావు పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఆదివారం నియోజకవర్గంలోని ఉల్వనూరులో డాక్టర్​ జీఎస్సార్ ​ట్రస్ట్​ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్​ పోటీల ముగింపు సందర్భంగా ఆయన పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

‘ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ గత ఎన్నికల్లో వనమా చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ పోటీ అంటున్నారు’ అని ఎద్దేవా చేశారు.‘తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా ప్రోగ్రామ్స్​కు వస్తే దళిత బంధు ఆపేస్తా, ఇంకోటేదో స్కీం తీసేస్తా అంటూ ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవ బెదిరిస్తున్నారు’ అని అన్నారు. ‘ఇలా ఎన్ని రోజులు. ఇంకా నాలుగు నెలలు మాత్రమే’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వారినే ఎన్నుకోవాలన్నారు.