చిలీ నూతన అధ్య‌క్షుడిగా గేబ్రియేల్‌ బోరిక్‌

చిలీ: దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో క‌మ్యూనిస్టులు మ‌ళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. కన్జర్వేటివ్ నేతలకు వ్య‌తిరేకంగా లెఫ్టిస్టులు సాగించిన పోరులో 35 ఏళ్ల గేబ్రియేల్‌ బోరిక్ చిలీ దేశానికి కొత్త అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. చిలీ ఎన్నికల ఫలితాలలో, లెఫ్టిస్టు యువ నేత గాబ్రియేల్‌ బోరిక్ 56 శాతం ఓట్లు పొంద‌గా, ఆయ‌న ప్ర‌త్య‌ర్థి మితవాద ఆంటోనియాకు 44 శాతం ఓట్లు దక్కాయి. హోరాహోరీగా సాగిన పోరులో యువ ఓటర్లే కీల‌కంగా మారారు. ఈ ఎన్నిక‌ల‌లో గెల‌వ‌డంతో చిలీ దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత పిన్నవయస్కుడైన అధ్య‌క్షుడిగా గేబ్రియ‌ల్ బోరిక్ నిలుస్తారు.

చిలీలో కార్మికులకు, సాధారణ ప్రజల‌కు పెన్షన్‌, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సంస్కరించడం, వారానికి పని గంటలను 45 నుండి 40కి తగ్గించడం, గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పెంచడం ద్వారా అసమానతలను పరిష్కరిస్తామంటూ గాబ్రియెల్ బోరిక్‌ ఇచ్చిన హామీలను న‌మ్మి అక్క‌డి ప్ర‌జ‌లు అత‌ని వెంట నిల‌బ‌డ్డారు. మ‌రోవైపు ప్రత్యర్థి పార్టీ నేత ఆంటోనియా.. మహిళల సమస్యలు, సేమ్ సెక్స్ మ్యారేజ్‌స్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బోరిక్ కు కలిసొచ్చాయి. లాటిన్ అమెరికా దేశాల‌లో చిలీ దేశానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. మిగ‌తా వాటితో పోలీస్తే చిలీకి సుస్థిర, సంప‌న్న లాటిన్ అమెరికా దేశంగా పేరు ఉంది. కొన్నేళ్లుగా చిలీలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. మెట్రో, బస్, ఇంధన చార్జీల పెరుగుదలతో అక్కడి ప్రజలు ప్రభుత్వ పాలనకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేస్తున్నారు. బోరిక్‌ గెలుపుతో చిలీలో సరికొత్త అధ్యాయం మొదలైందని విశ్లేషకులు అంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/