నేటి నుంచి జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం

G20FMM: India welcomes Foreign Ministers for G20 meet amid increasing rift between Russia, West over Ukraine war

న్యూఢిల్లీః ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ జీ20 దేశాల విదేశాంగ మంత్రులు బుధ, గురువారాల్లో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశంకానున్నారు. సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బీర్‌బాక్, బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్‌తో పాటు పలు ఐరోపా దేశాల విదేశాంగ మంత్రులు హాజరుకానున్నది. బుధవారం విదేశీ అతిథులకు స్వాగతం పలికే కార్యక్రమం ఏర్పాటు చేయగా.. గురువారం రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.

కాగా, సమావేశాలో ఆహారం, ఇంధన భద్రత, తీవ్రవాదం, మానవతా సహాయం, విపత్తుల సహాయం తదితర అంశాలపై చర్చించే అవకాశలున్నాయి. జీ20 సమావేశాలకు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్‌లను భారత్‌ అతిథులుగా ఆహ్వానించింది. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో త్జాన్, ఆస్ట్రేలియాకు చెందిన పెన్నీ వాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి యువరాజ్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఇండోనేషియాకు చెందిన రెట్నో మార్సుడి, అర్జెంటీనా విదేశాంగ మంత్రి శాంటియాగో కెఫిరో సమావేశాలకు హాజరుకానున్నారు. మరో వైపు జీ20 సమావేశాలకు జపాన్‌ విదేశాంగ మంత్రి హాజరుకావడం లేదు. దేశీయ పార్లమెంటరీ సమావేశాల కారణంగా సమావేశానికి హాజరు కావడం లేదని మంత్రి హయాషి తెలిపారు. అయితే.. ఆయన స్థానంలో డెప్యూటీ మంత్రిని పంపాలని టోక్యో యోచిస్తున్నది.