మందులతో మగ్గిస్తున్న పండ్లతో ప్రమాదం!

Fruits
Fruits

మేడి పండు చూడు మేలిమై ఉండును..పొట్ట విప్పిచూడు పురుగులుండు.. అనే నానుడిని నిజం చేస్తూ..ప్రస్తుతం మార్కెట్‌లో లభించే పండ్లలో ఏవి నకిలీ..ఏవి అసలో తెలియక జనం పరేషాన్‌ అవుతున్నారు. జిల్లాలో కార్బైడ్‌,రసాయనాలతో మాగపెట్టిన పండ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. అధికారుల సరైన నిఘా లేకపోవడంతో వ్యాపారులు ఇలా రెచ్చిపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత కొంతకాలంగా హైద్రాబాద్‌కే పరిమితిమైన పండ్ల కల్తీ.. యథేచ్చగా కొనసాగుతుంది. కల్తీలేని పండ్లు దొరకవంటే అతిశయోక్తి కాదు. పండ్ల వ్యాపారుల ఇష్టం వచ్చిన రసాయనాలను వాడి పండ్లను తొందరగా మగ్గబెట్టి మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. చూడటానికి మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించే పండ్లు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపెడుతున్నాయి. పండ్లను త్వరగా మాగపెట్టేందుకు వ్యాపారులు నిషేధిత ఉత్ప్రేరకాలను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. కాలిష్యం కార్బైడ్‌, ఇఫాన్‌, పారాఫిక్‌ నాక్స్‌ లాంటి హానికారక మందులను వాడి పండ్లను మాగపెడుతున్నారు.
వాటిని తింటే ఆరోగ్యం మాట అటు ఉంచితే..కొత్త రోగాలు రావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు స్ప్రేలు కూడా వాడి పండ్లను మాగపెడుతున్నారనే ఆరోఫనలు బలంగా వినిపిస్తున్నాయి. పొరుగు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి రసాయన పదార్థాల ద్వారా మగ్గించిన పండ్లను దిగుమతి చేసుకొని జిల్లాలో విరివిగా అమ్మేస్తున్నారు. పండ్ల కల్తీపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశించినా..తూతూ మంత్రంగానే సాగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అధికారులు వ్యాపారులపై నిఘాను మంరిత పటిష్టం చేసి కల్తీ జరగకుండా చూడాలని,రసాయనాలతో మాగపెట్టిన పండ్ల విక్రయాన్ని అడ్డుకోవాలని, కల్తీ చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.