తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ : 12 ఏళ్ల‌ లోపు పిల్లలకు శాశ్వ‌త ఉచిత బస్ ప్ర‌యాణం

తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ఎన్నో తీపి కబుర్లు తెలుపగా..న్యూ ఇయర్ రోజు మరో తీపి కబురు తెలిపి ఆనందపరిచింది. రాష్ట్రంలో 12 ఏళ్ల లోపు ఉన్న పిల్ల‌లంద‌రికీ టీఎస్ ఆర్టీసీ బ‌స్సుల‌లో శాశ్వతంగా ఉచిత ప్ర‌యాణం ఉండేలా తీసుకుంటామ‌ని టీఎస్ ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ లో కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లను నిర్వ‌హించారు.

ఈ వేడుక‌ల్లో ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తో పాటు ఎండీ స‌జ్జ‌నార్ ఉన్నారు. కేక్ క‌ట్ చేసి ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు నూత‌న సంవ‌త్సర శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆనంత‌రం ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ కీలక ప్ర‌క‌ట‌న చేశారు. పిల్లలకు ఫ్రీ ప్రయాణం అమల్లోకి వస్తే వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీలో ప్రయాణించేందుకు మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. తద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశముందన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టినట్లు బాజిరెడ్డి తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి అందించాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. రిటైర్మెంట్ తీసుకున్న వారి కుటుంబాల్లోని పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కూడా ఉందన్నారు. సంస్థను అభివృద్ధిలోకి తెచ్చేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నామని.. సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.