ఇస్లాం తీవ్రవాద వ్యతిరేక బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభ ఆమోదం

హింసను ప్రేరేపిస్తే మత సంస్థలపై నిషేధం

పారిస్‌: ఫ్రాన్స్‌ ఇస్లాం తీవ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఐదేళ్ల క్రితం జరిగిన ‘చార్లీ హెబ్డో’ ఘటన.. ఇటీవలి టీచర్ కిరాతక హత్య ఘటనల నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఇస్లాం తీవ్రవాద వ్యతిరేక బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభ ఆమోదం తెలిపింది. 347 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు తెలుపగా, 151 మంది వ్యతిరేకించారు. మరో 65 మంది ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో దిగువ సభలో భారీ మెజారిటీతో బిల్లు పాసైంది. అయితే, ఆ బిల్లును ఇప్పుడు ఎగువ సభ అయిన సెనేట్ కు పంపాల్సి ఉంది. అక్కడ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పార్టీకి మెజారిటీ లేదు.


కాగా, గత ఏడాది అక్టోబర్ 16న శామ్యూల్ పేటీ అనే ఓ ఉపాధ్యాయుడిని చెచెన్ ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ అతి కిరాతకంగా చంపేసింది. అతడి తల నరికి ప్రాణాలు తీసింది. భావ స్వేచ్ఛకు సంబంధించిన పాఠాలు చెబుతూ ప్రవక్త మహ్మద్ కార్టూన్లను చూపించినందుకు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇస్లాం ఉగ్రవాదాన్ని అణచివేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇదొక్కటే కాదు.. 2015 నుంచి ఐదేళ్లలో 250 మందికిపైగా ఆ దేశంలో ఉగ్రవాదానికి బలయ్యారు.


ఆ తర్వాత వెంటనే ఓ ఫ్రెంచ్ మహిళా పోలీసును క్రూరంగా హత్య చేశారు. యూదు సూపర్ మార్కెట్ లో నలుగురు ఫ్రెంచ్ యూదులను ఊచకోత కోశారు. అదే ఏడాది నవంబర్ 13న స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం, సెంట్రల్ పారిస్ లోని బార్లు, రెస్టారెంట్లు, బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ లో దాడులు చేసి 130 మందిని బలి తీసుకున్నారు. ఇవే కాదు.. ఇలాంటివి ఎన్నో ఘటనలు ఇటీవలి కాలంలోనూ జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ ఈ కొత్త బిల్లును తీసుకొచ్చింది.

అయితే, బిల్లుపై ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇస్లామోఫోబియా పట్టుకుందని పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/