సంక్షోభంలో బొరిస్ సర్కార్.. మరో నలుగురు మంత్రుల రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేయగా.. తాజాగా మరో నలుగురు మంత్రులు అదే బాటలో పయనించారు. మొదట శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్స్, రవాణాశాఖ మంత్రి లారా ట్రాట్ రాజీనామా చేశారు. తర్వాత కొద్ది సేపటికే మంత్రులు జాన్ గ్లెన్, విక్టోరియా అట్కిన్స్ తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని క్విన్స్ విమర్శించారు. ఈ తరుణంలో తనకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో తెలిపారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు రవాణా మంత్రి లారా ట్రాట్ చెప్పారు.
ప్రభుత్వాన్ని వీడడం బాధగా ఉందని.. కానీ ఇక్కడ కొనసాగలేకే ఈ నిర్ణయానికి వచ్చానని సునాక్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బ్రిటన్ను కర్మభూమిగా కీర్తించిన సునాక్.. తన లాంటి వారు సైతం ఛాన్సలర్ అయ్యే అవకాశం ఇక్కడ ఉందన్నారు. పించర్ ఆరోపణలపై ప్రభుత్వం పారదర్శకమైన విచారణ చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏ ప్రమాణాల కోసం రాజీనామా చేశానో.. వాటి కోసం పోరాడుతానన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/