కాంగ్రెస్ సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. 81 ఏళ్ల ఫెర్నాండెజ్ ఈ ఏడాది జులైలో ఇంట్లో యోగా చేస్తుండగా కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు ఆయనకు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన మంగళూరులోని ఆస్పత్రిలోని ICUలో నే ఉన్నారు. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఫెర్నాండెజ్ మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇక ఆస్కార్ ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న జన్మించారు. కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న బోర్డ్ హైస్కూల్లో ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ ప్రఖ్యాతి పొందిన హెడ్ మాస్టర్. ఆయన తల్లి లియోనిసా ఫెర్నాండెజ్. ఉమ్మడి దక్షిణ కనర జిల్లాకు ఆమె మొట్టమొదటి బెంచ్ మెజిస్ట్రేట్. సెయింట్ సీసిలీస్ కాన్వెంట్ స్కూల్లో విద్యను అభ్యసించిన ఆస్కార్ ఆ తర్వాత ఎంజీఎం కాలేజీలో చదువుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొనేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఫెర్నాండెజ్ మృతి పట్ల ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.