కేటీఆర్ కు త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ కౌంటర్..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ కు త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్య నిర్వహణ సమావేశాలు రేపటి నుండి మొదలుకాబోతున్నాయి. రేపు , ఎల్లుండి జరగబోయే ఈ సమావేశాలు బిజెపి అగ్ర నేతలు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే అంత హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు ప్రధాని మోడీ రానున్నారు. ఈ క్రమంలో త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్.. ఆదిలాబాద్ జిల్లాలో జైన దేవాలయాన్ని దర్శించుకొని , అక్కడున్న నేతలతో సమావేశం జరిపారు.

బిజెపి సమావేశాల నేపథ్యంలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ బిర్యాని తిని, ఇరానీ ఛాయ్ తాగండి అంటూ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై బిప్లవ్ కుమార్ దేవ్ కౌంటర్ ఇచ్చారు. బిర్యానీ తినిపించడానికి, ఛాయ్ తాగిపించడానికి ప్రగతి భవన్ కు పిలిస్తే తాము తప్పకుండా వస్తామని అన్నారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పాలనపైనే తాము విమర్శలు చేస్తున్నామన్నారు. సంక్షేమ పాలన ఎక్కడుంటుందో.. అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలుకు నిధులు కేటాయిస్తోందన్నారు. నిధులు రావడం లేదనే విమర్శలను తిప్పికొట్టారు. నిధులు కావాలంటే సంబంధిత మంత్రిని కలవాల్సి ఉంటుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జీఎస్టీ సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎంలు లేదా ఆర్థిక మంత్రులు పాల్గొంటారని తెలిపారు. ఇటీవలే మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశంలో ఏం చెప్పారని ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చి మరో విధంగా స్టేట్ మెంట్ ఇవ్వడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.