బిఆర్ఎస్ లో చేరబోతున్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి..?

కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ లోకి వలసలు మొదలయ్యాయి. అతి త్వరలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈయన బిజెపి పార్టీ కి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు.

2015లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన గిరిధర్ తాజాగా బీజేపీ ప్రాథ‌మిక స‌భ్యత్వానికి రాజీనామా చేశారు. గిరిధర్ తో పాటుగా ఆయన కుమారుడు శిశిర్ గ‌మాంగ్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. జనవరి 27న కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేర‌నున్నారని సమాచారం. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్‌, లక్ష్మీపూర్‌ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్‌ సతీమణి హేమ గమాంగ్‌ 1999లో ఎంపీగా వ్యవహరించారు. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను గిరిధ‌ర్ గ‌మాంగ్ త‌న కుమారుడితో కేసీఆర్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే.