ఎన్ఎస్ఈ మాజీ సీఈవోకు బెయిల్ మంజూరీ

మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు

former-nse-chairman-chitra-ramkrishna-granted-bail-in-money-laundering-case

న్యూఢిల్లీః నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్ఎస్‌సీ) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టులో తాజాగా ఊరట లభించింది. చట్టవిరుద్ధంగా ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడిన కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆమెకు గురువారం బెయిల్ మంజూరైంది. ఫోన్‌ట్యాపింగ్ కేసులో చిత్ర రామకృష్ణకు గతంలోనే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.

కాగా.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టంలో ప్రస్తావించిన ఆరోపణలేవీ ఈడీ తనపై చేయలేదని చిత్ర తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి అయిన చిత్రకు బెయిల్ మంజూరు చేయకూడదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాదించింది.

ఎన్‌ఎస్ఈ కోలొకేషన్ కుంభకోణం కేసులో చిత్ర రామకృష్ణను తొలుత సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో ఆమెకు బెయిల్ మంజూరైంది. ఇక ఫోన్‌ట్యాపింగ్ కేసుకు సంబంధించి చిత్రను ఈడీ గతేడాది జులైలో అరెస్ట్ చేసింది. ఈడీ ఆరోపణల ప్రకారం.. 2009 నుంచి 2017 మధ్య కాలంలో ఎన్ఎస్‌ఈ ఉద్యోగుల ఫోన్ల ట్యాపింగ్ జరిగింది. దీని వెనుక చిత్ర రామకృష్ణతో పాటూ మాజీ ఎన్ఎస్‌ఈ సీఈఓ రవి నారాయణ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవి వారణాసి, హెచ్(ప్రెమిసెస్) మహేశ్ హల్దీపూర్ మరికొందరు ఉన్నారు. వీరి సహకారంతో ఐసెక్ అనే సంస్థ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎన్ఎస్‌సీ ఉద్యోగులపై నిఘా పెట్టింది. భద్రతా పరమైన సమస్యలు గుర్తించేందుకంటూ వారిపై ఓ కన్నేసింది.

చిత్ర రామకృష్ణ 2009లో ఎన్‌ఎస్ఈ జాయింట్ ఎమ్‌డీగా నియమితులయ్యారు. 2013 ఏప్రిల్ 1 నుంచి 2016 డిసెంబర్ వరకూ సంస్థ ఎమ్‌డీ అండ్ సీఈఓగా పని చేశారు.