మాజీ ఎంపీ ప్రచార ‎రథాన్ని ‎తగలబెట్టిన ‎గుర్తు ‎తెలియని ‎వ్యక్తులు

వైసీపీ, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆయన కార్యాలయం దగ్గర ఈ వాహనం ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మార్గాని భరత్ కు సమాచారం అందించారు.

ఇక, వెంటనే మాజీ ఎంపీ మార్గాని భరాత్ తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భరత్ రామ్‌ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో ఇలాంటి విష సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారంటూ తాను ఎప్పటి నుంచో చెబుతున్నాను.. ఇలాంటి పరిస్థితి రాజమండ్రిలో ఏర్పడటం దారుణమని మార్గాని భరత్ అన్నారు.