జగన్ కు షాక్ ఇచ్చిన మేక‌తోటి సుచ‌రిత‌..ఎమ్మెల్యే పదవికి రాజీనామా

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కొత్త మంత్రి వర్గ ఏర్పటు పెద్ద సమస్య గా మారింది. కొత్త మంత్రి వర్గం చేస్తున్నామనగానే అంత తమ మంత్రి పదవులకు రాజీనామా చేసారు. మరోసారి జగన్ ఛాన్స్ ఇస్తాడని నమ్మకంతో రాజీనామా చేసారు. కానీ జగన్ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లడం తో రగిలిపోతున్నారు. కొంతమంది మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటే , మరికొంతమంది రాజీనామాలు చేస్తున్నారు.

మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఏకంగా తన రాజీనామా లేఖను పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అందజేయడం ఇప్పుడు చర్చ కు దారితీసింది. తనను మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ మేకతోటి సుచరిత రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అందజేశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె వెల్లడించారు. స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేశారని, బుజ్జగింపులకు లొంగదలచుకోలేదని తేల్చి చెప్పారు. మంత్రివర్గం నుంచి తప్పించడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

దీనిపై మోపిదేవి స్పందిస్తూ, వైసీపీ అంతా ఒకటే కుటుంబమని, అసంతృప్తులు ఉన్నా త్వరలోనే సమసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పదవి ఒక్కటే ముఖ్యం కాదని హితవు పలికారు. కాగా, మేకతోటి సుచరిత కుటుంబ సభ్యులు గత కొన్నిరోజులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేందుకు విఫలయత్నాలు చేసినట్టు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురిని మంత్రివర్గంలో కొనసాగిస్తూ, తనను మాత్రం తప్పించడంపై మేకతోటి సుచరిత తీవ్ర వేదనకు గురైనట్టు సమాచారం.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ ను సీఎం జ‌గ‌న్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేడు కొత్త కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నుంది. గ‌తంలో మంత్రులుగా ఉన్న వారిలో 11 మందికి వైఎస్ జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే ఇటీవ‌ల రాజీనామా చేసిన వారిలో చాలా మంది కొత్త కేబినెట్ లో మంత్రి ప‌దువులు ఆశించారు. అయితే వారి ఆశాల‌పై వైఎస్ జ‌గ‌న్ నీళ్లు చ‌ల్లారు. దీంతో ప‌లువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. వైసీపీ పై, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు.