టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి

Former Chairman of Tata Sons Cyrus Mistry died

టాటా గ్రూప్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. పాల్ఘర్‌లోని సూర్య నదిపై ఉన్న వంతెనపై ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సైరస్ మిస్త్రీతో పాటు ముగ్గురు వ్యక్తులు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గాయాలు పాలైనట్టు తెలిసింది. వారిని వెంటనే గుజరాత్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

ఇక 2012 నుంచి 2016 మధ్య కాలంలో సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్‌కి ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ గ్రూప్‌కి ఆరో ఛైర్మన్ ఇతను. కానీ 2016 అక్టోబర్‌లో సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ అర్థాంతరంగా ఛైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఈ విషయంలో సైరస్ మిస్త్రీ ఏళ్ల పాటు టాటా గ్రూప్‌తో పోరాడారు.

సైరస్ మిస్త్రీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిస్త్రీ మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. “సైరస్ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరం. ఆయన భారతదేశ ఆర్థిక పరాక్రమాన్ని విశ్వసించిన మంచి వ్యాపారవేత్త. ఆయన మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అని మిస్త్రీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.