రాష్ట్రానికి హార్వర్డ్‌ వర్సిటీ బృందం

గురుకులాల వ్యవస్థ అధ్యయనం కోసం

gurukul
gurukul

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాల వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ బృందం రాష్ట్రానికి రానుంది. సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం నాణ్యమైన విద్యను అందిస్తూ, దేశంలోని అన్ని ఉన్నత వర్గాల పిల్లలు అందుకునే విద్యను పేద పిల్లలకు కూడా అందించాలన్న లక్ష్యంతో గురుకులాల వ్యవస్థ పని చేస్తోంది. గత ఆరేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశ విద్యా వ్యవస్థ మీద తనదైన ముద్ర వేస్తోంది. గురుకుల విద్యా వ్యవస్థ పనితీరు, సాధిస్తున్న విజయాలతో పాటు గురుకులాల గురించి తెలుసుకోవడానికి హార్వర్డ్‌ యూనివర్సిటీ బృందం రాష్ట్రానికి వస్తోంది. భారద దేశ విద్యా వ్యవస్థలో భాగంగా గురుకులాల్లో పేద పిల్లలకు ఎలాంటి విద్యను ఎలాంటి కొత్త ప్రణాళికలతో అందిస్తున్నారు. 21వ శతాబ్ధానికి కావాల్సిన నైపుణ్యాలను ఎలాంటి మార్పులతో అందిస్తున్నారన్న విషయంపై అధ్యయనం చేసేందుకు యూనివర్సిటీ బృందం వస్తున్నట్లు హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫేసర్‌ ఫెర్నాండో రీమర్స్‌ ఎస్సీ,ఎస్టీ గురుకులా విద్యా సంస్థల కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించారు. రాష్ట్ర విద్యా చరిత్రలో ఇది ఎంతో అరుదైన విషయమే కాకుండా గురుకులాలలకు ఇస్తున్న గౌరవంగా భావించవచ్చు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న గురుకులాల్లో నిరుపేద వర్గాల పిల్లలు ఎలా తమ నైపుణ్యాలను పెంచుకుని ఉన్నతంగా ఎదుగుతున్నారో తెలుసుకోవడం కోసం హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రత్యేకంగా రావడం దేశ చరిత్రలో ఇది మొదటిసారని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయుల వృత్తి విద్యా నైపుణ్యాలను, పిల్లలు నాయకులుగా ఎదుగుతున్న క్రమాన్ని వాళ్లు అధ్యయనం చేస్తారు. రాబోయే కాలానికి కావల్సిన అన్ని నైపుణ్యాలను ఎలా అందిపుచ్చుకుంటున్నారో తెలుసుకునేందుకు హార్వర్డ్‌ యూనివర్సిటీ బృందం గురుకుల కార్యాలయాన్ని, పాఠశాలలను సందర్శించి అధ్యయనం చేస్తారు. కేజీ టూ పీజీ మిషన్‌లో భాగంగా గురుకులాలను ఇంతటి గొప్ప స్థాయికి తీసుకెళ్లేందుకు అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచస్థాయి విద్యా విధానాన్ని అవలంబిస్తూ పేద పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ఉపాధ్యాయులను, అవకాశాలను అందుకుని విజయాలు సాధిస్తున్న విద్యార్థులను కూడా ఆయన అభినందించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/