పోటీపరీక్షల్లో విజయం కోసం..

For Success in Competition Tests .

సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, బ్యాంకు పరీక్షలు, వివిధ రకాల కాంపిటేటివ్‌ పరీక్షల్లో విజయానికి సొంత బలాబలాల అంచనా అవసరం. అన్ని పోటీపరీక్షల్లోనూ వేర్వేరు విద్యా నేపథ్యాలు ఉన్నవారు విజయం సాధించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోటీపరీక్ష ఎంపిక జరగాలి. కానీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చడానికో, స్నేహితుల ప్రభావం కారణంగానో ఎంపిక చేసుకుంటే సొంత బలాలు వాటితో అనుసంధానం కాక ఆశించిన ఫలితం రాదు.

పోటీ పరీక్షల్లో సరైన మార్గదర్శకత్వం విజయానికి చేరువ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుని మొదటిసారి పోటీపరీక్షలకు హాజరవుతున్నవారికి సరైన మార్గదర్శకత్వం లేక వారి తొలి ప్రయత్నం వృథా అవుతుంటుంది. మంచి అధ్యాపకుల్లో, పోటీపరీక్షల్లో సీనియరో, మంచి శిక్షణ సంస్థ మార్గదర్శకత్వం ఇస్తేనో ప్రతిభగల అభ్యర్థులు త్వరగా గ్రహిస్తారు.

పోటీపరీక్షల్లో సత్వర ఫలితాలు వస్తాయి. కొన్ని నెలలు లేదా సంవత్సరాల కృషి అనంతరం రాసిన పోటీ పరీక్షల ఫలితాలు ప్రతికూలంగా రావడం నిరాశను కలిగించడం సహజం. అప్పటివరకు వేసిన అంచనాలు, కన్న కలలు తలకిందులయ్యాయన్న వ్యధ కలగడమూ మామూలే. అయితే దీనిని సుదీర్ఘ ప్రయాణంలో భాగంగానే చూడాలి.

జీవన యానంలో ఒక అడుగుగానే భావించాలి. అపజయాన్ని అంగీకరిచడం, ఫలితం ప్రతికూలమైనప్పుడు మనసు పరిపరివిధాల పోతుంది. ఈసొంత పరాజయాన్ని మరెవరి మీదైనా నెట్టెయ్యాలని మనసు ఉవ్విళూరుతుంది. అందుకు ఎవరిని నిందించాలన్న అంతర్మథనం మొదలవుతుంది. కానీ అసలు వాస్తవం- వైఫల్యానికి కారణమైన ప్రతి నిర్ణయం అభ్యర్థిదే. సరైన వ్యూహం ఎంచుకోకపోయినా, తగిన ప్రణాళిక వేసుకోలేకపోయినా, తీసుకున్న శిక్షణలో తగిన ప్రమాణాలు లేకపోయినా, ఇలా కారణం ఏదైనా ఆ నిర్ణయం సొంతదారు అభ్యర్థే. కాబట్టి, యథాతథంగా దాన్ని స్వీకరించడం మేలు. ఓటమిని అంగీకరించడం తరువాత సాధించబోయే విజయంలో తొలిమెట్టు.

పోటీపరీక్షల ఫలితాలు రావడంతోనే అపజయం చవిచూసిన అనంతరం చాలామంది తక్షణం మళ్లీ సన్నద్ధతలో పడిపోతారు. అయితే వైఫల్యం తాలూకు వేదన మాత్రం మనసును కుదిపేస్తుంటుంది. అలాంటి కల్లోల స్థితిలోనే సన్నద్ధత కొనసాగించడం వల్ల సంపూర్ణ ఏకాగ్రత కుదరదు. అందుకే కనీసం పక్షం రోజులు సన్నద్ధతకు దూరంగా ఉండి, కల్లోలిత మనసును కుదుటపడనివ్వాలి. ఇది సమయాన్ని వృథాచేయడం కాదు.

పరుగు పందెంలో మోకాలుపై వంగి ఒక కాలు వెనక్కివేసి, తగిన శక్తి పుంజుకునే ప్రయత్నం చేసినట్టు ఈ స్వల్ఫ విరామం రాబోయే పెద్ద ప్రయత్నానికి పునాది అవుతుంది. ఇలా విరామం తీసుకోవడం వల్ల మనసు కాస్త స్థిమితపడి అంత: విశ్లేషణ మొదలవుతుంది. చేసిన ప్రయత్నంలో అంతర్గతంగా తప్పొప్పుల సమీక్ష జరుగుతుంది. అప్పటికే విజయ సారథుల మనోగతాలు వెల్లడవుతాయి. కాబట్టి,వారితో తన ప్రయత్నాన్ని సరిపోల్చుకోవడానికి వీలవుతుంది.

ముఖ్యంగా ఓటమి పరాభవాన్ని వెనక్కినెట్టి అసలు కారణాల అన్వేషణకు మనసు సిద్ధపడుతుంది.పోటీపరీక్షల్లో ఎదురైన చేదు అనుభవం పరాభవం ఫలితంగా ఉత్పన్నమయ్యే తక్షణ స్పందన దశ నుంచి బయిటపడ్డాక నిజమైన స్వీయ పరిశీలన మొదలవ్వాలి. సాధారణంగా పోటీపరీక్షల్లో పరాజయానికి రెండు కారణాలుంటాయి. వ్యక్తిగత కారణాలు మొదటి కోవకు చెందితే, సదరు పోటీపరీక్ష సన్నద్ధతలో విషయపరమైన లోపాలు రెండోకోవకు చెందుతాయి. ముందు తనకు మాత్రమే తెలిసిన వ్యక్తిగత కారణాలను పరిశీలిస్తే….ఒక్కో తరహా పోటీ పరీక్షకు ఒక్కో ప్రత్యేక పంథాలో సన్నద్ధత అనివార్యమవుతుంది.

సివిల్‌ సర్వీసెస్‌లో విజయానికి ఒక విధమైన సన్నద్ధత అవసరం. అయితే, ఐఐటి జెఈఈ పరీక్షకు మరో విధమైన సన్నద్ధత అవసరం. దీన్ని బట్టి అందుకు తగ్గట్టుగా దినచర్య అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణ అలవరుచుకోవాలి. ఇది పోటీ పరీక్షార్థికి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కానీ వ్యక్తిగత బలహీనతల కారణంగా క్రమశిక్షణ తప్పడం వల్ల విజయానికి దూరమవుతారు.

కొంతమంది అభ్యర్థులు వ్యక్తిగతంగా మంచి క్రమశిక్షణ చూపుతూ ఎటువంటి చంచలభావం లేకుండా ఒకే ఒక పోటీపరీక్షకు అంకితమై ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా సత్ఫలితం రాదు. రాష్ట్ర సర్వీస్‌ కమీషన్‌ గ్రూప్స్‌లో ఇటువంటి అభ్యర్థులు తారసపడుతుంటారు. ఇలాంటి వారి విషయంలో వ్యక్తిగత కారణాలకంటే సన్నద్ధత పర్వంలో చేసిన పొరపాట్లే విజయాన్ని ప్రభావితం చేస్తాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/