ఎదిగే పిల్లలకు ఆహారం

EATING EGG
EATING EGG

పిల్లలు గలగల పారే సెలయేరుల్లా ఉంటారు. ఒకచోట స్థిరంగా ఉండరు. ఈ వయసులోనే వారి మెదడు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాని పెరుగుదలకు మేలు చేసే పోషకాలను అందించాలి. పిల్లల పెరుగుదలకు పాలు అత్యంత ఆవశ్యకమైనవి. పాల నుంచి వారికి మాంసకత్తులూ, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. పాలలోని కాల్షియం, ఫాస్ఫరస్‌ మూలకాలు ఎముకలూ, దంతాలూ, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎ,బి2, బి12, డి విటమిన్లు, జింక్‌, ఎముకలను దృఢంగా మారుస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుపూటలా పిల్లలకు పాలు ఇవ్వటం మంచిది. చిక్కుళ్లు కూడా పిల్లల పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లూ, మాంసకృత్తులూ, పీచూ, కాల్షియం, ఇనుము, విటమిన్‌ – బి ఉంటాయి. కొవ్వు శాతం కూడా తక్కువే. అంతేకాదు శరీరానికి అవసరమయ్యే అత్యవసర పోషకాలు మెండుగా ఉంటాయి.

చిక్కుడు, సోయా, రాజ్మా, ఉలవలు ఇలా వేటినైనా ఎంచుకోవచ్చు. వీటితో రకరకాల వంటకాలు చేసి చిన్నారులకు పెట్టాలి. పాల పదార్థమైన చీజ్‌ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకు సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో మాంసకృత్తులూ, విటమిన్‌ -బి12, ఫాస్ఫరస్‌ ఉంటాయి. మాంసం తీసుకునే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. పిల్లలకు ఆహారంలో దీన్ని కూడా ఇవ్వవచ్చు. గుడ్లు పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి.

దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే మాంసకృత్తులూ, విటమిన్‌ -బి పోషకాలు మెదడు అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటితో పాటు ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ – డి, ఫోలియేట్‌, జింక్‌, ఇనుము, సెలీనియం ఉంటాయి.ఇవన్నీ వారి పెరుగుదలకు తోడ్పడతాయి. పిల్లలకు రోజు గుడ్డు తినిపించడం మంచిది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/