ఆహారం – విహారం

Ramana Maharshi
Ramana Maharshi

యుక్తా హారస్య విహరస్య యుక్త చేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా
భగవద్గీత ఆరవ అధ్యాయములోని 7వ శ్లోకం ఇది. చాలా శ్రద్ధగా చదివి, అర్ధం చేసుకుని ఆచరించవలసిన విషయం ఉంది ఇందులో. యోగము, ధ్యానము చేసే ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే విషయం ఉంది. ఈ శ్లోకానికి తెలుగు అర్ధాన్ని ముందు తెలుసుకొందాం. తగిన విధంగా ఆహార విహారాలను, తగు విధంగా చేసే పనులను, తగిన విధంగా నిద్రించే వానికి, మేల్కొనే వానికి యోగం సిద్ధిస్తుంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో యోగం, ధ్యానం వైపు ఆకర్షితులై వాటిని సాధన చేస్తున్నారు. యోగం, ధ్యానం నేడు కేవలం భారతీయులకు మాత్రమే పరిమితం కాలేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విజ్ఞులు వివరించాల్సి ఉంటుంది. శంకరాచార్యుల భాష్యాన్ని బట్టి ‘ఆహారం అంటే లోపలికి తీసుకునేది. ‘విహారం అంటే తిరగడం, ఈ రెండూ శరీరానికి, మనస్సుకు సంబంధించినవే. నోటితో తీసుకుని అన్నం, కళ్లతో, చెవ్ఞలతో లోపలికి తీసుకునే విషయం ఈ రెండింటినీ గూర్చి ఉంది ఇక్కడ. చాలా మంది కేవలం అన్నంను గూర్చే చెబుతూ శాఖాహారమే తినాలని, మాంసాహారాన్ని ముట్టరాదని, నిన్నరాత్రి చేసిన చద్ది అన్నాన్ని తినరాదని ఇలా ఏమేమో చెబుతుంటారు. శంకరాచార్యుల వారు వారి భాష్యంలో ఇవేవీ చెప్పలేదు.

భగవాన్‌ రమణమహర్షి వంటశాలలోకి వెళ్లి ముందురోజు రాత్రి మిగిలిన ఆహార పదార్ధాలన్నీ, దేన్నీ వ్యర్ధ పరచక, ఆనాటి వంటల్లో కలిపేవారని సూరి నాగమ్మలేఖలు, ఇతర గ్రంథాలు తెలుపుతాయి. చేపలు తినడం మానమంటారా? అని ఎవరైనా రామకృష్ణ పరమహంసను అడిగితే నీవ్ఞ మానవలసిన పనిలేదు, అవే నిన్ను వదులుతాయి అనేవాడు ఆయన. ఇక ఎవరైనా శారీరకంగా బలహీనంగా ఉంటే చేపలు తినమని శారదాదేవి స్వయంగా చెప్పేవారు. ఇక వివేకానంద స్వామి భగవద్గీతను చదువ్ఞతూ కాలం గడిపేవానికంటే బాగా ఫుట్‌బాల్‌ ఆడేవానికి భగవత్‌ తత్వం త్వరగా అర్ధమవ్ఞతుందంటాడు. ఇంతకూ మనం అర్ధం చేసుకోవలసింది ‘మితాహారం ముఖ్యమని. ఇక ఎక్కువ ఆవేశాన్ని, ఆందోళనను, ఉద్రేకాన్ని కల్గించనివి ఏవో వైద్యులను, పోషకాహార నిపుణులను అడిగి తెలుసుకొని వాటిని సాధ్యమైనంత వరకు వదులుకోవచ్చు.

ఆహారం విషయం చాదస్తం ఎంత ముదిరి పోయిందంటే శాఖాహారమే తినాలి, దాన్ని కూడా అగ్రవర్ణం వారే వండి ఉండాలి. ఇదే శ్రీకృష్ణుని ఉద్దేశమయితే అది మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే బోధ కాదని చెప్పాల్సి ఉంటుంది. నోటితో కేవలం పండ్లను, పాలను, శాకాహారాన్ని లోపలికి పంపుతూ చెవ్ఞలతో, కళ్లతో నానాకు విషయాలను లోపలకు నిత్యమూ పంపుతుంటే ప్రయోజనం ఉండదని గ్రహించాలి. ఇక విహారాన్ని గూర్చి యోచిద్దాం. ఈ శరీరం ఏదో ఒక పుణ్యక్షేత్రానికి పోయి ఉండి మనసు మాత్రం ఏ క్లబ్బుకో, పబ్బుకో పోయి ఉంటే సరిపోదు.

విహారం కూడా శరీరానికి, మనసుకూ చెందినది కాబట్టి ఆ విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి. మనసు విషయంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అది ఎక్కడికి పోయినా వెంటనే దాన్ని వెనక్కు తెచ్చి ఆత్మపై పెట్టాలంటాడు శ్రీకృష్ణుడు. ఎక్కువగా తినరాదు, అసలు తినకుండా ఉండరాదు. మొద్దు నిద్రపోరాదు. రాత్రంతా జాగరణ చేయరాదు. ఎప్పుడూ ఒక బండలా పడి ఉండరాదు, లేదా ఏదో ఒక పని కల్పించుకుని ఊర్లన్నీ తిరుగుతూ ఉండరాదు. అలాంటి వానికే యోగము అబ్బేది, ధ్యానం కుదిరేది, లక్ష్యం దక్కేది.

- రాచమడుగు శ్రీనివాసులు 

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com