శాంతించని గోదావరి..బిక్కుబిక్కు మంటున్న లంక గ్రామాలు

తెలంగాణ రాష్ట్రంలో వరణుడు కాస్త శాంతించినప్పటికీ..గోదారమ్మ మాత్రం శాంతించడం లేదు. మరింత ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏపీలోని లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు పల్లెలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణలో ఇంతటి భారీ వర్షాలు పడటం 34 ఏండ్ల తరువాత ఇదే మొదటిసారి. అత్యంత భారీ వర్షాలతో అనేక ప్రాంతాలలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవుతున్నది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో పాటు ఎగువన నుంచి వస్తున్న నీటితో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని సుమారు 40 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. గ్రామాల చుట్టూ వరద నీరు ఉండడంతో కొంతమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తుండగా , మరికొంతమంది మాత్రం తమ ఇళ్లను వదిలివెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇక రోజువారీ జీవనం గడపడం కష్టతరంగా మారింది. లక్షకు పైగా జనాభా వరద బాధితులుగా ఉన్నారు. కనీస అవసరాల కోసం కూడా మర పడవలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు.

ధవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజీకి జలాలు పోటెత్తుతున్నాయి. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురు, శుక్రవారాల్లో ఉద్ధృతి మరింత పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉండవచ్చని అంచనా. బుధవారం రాత్రి 11 గంటలకు 15,07,669 క్యూసెక్కులు వస్తుండగా.. అదే స్థాయిలో సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 15.10 అడుగులకు చేరింది. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో చాలాచోట్ల ఉద్యాన పంటలు, నర్సరీ మొక్కలు నీట మునిగాయి. కొవ్వూరు మండలం మద్దూరు లంకకు ముంపు ముప్పు ఎదురవగా.. గ్రామంతోపాటు, గట్ల పరిస్థితినీ అధికారులు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లోని 338 మంది గర్భిణులను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. హైరిస్క్‌ గర్భిణులు 52 మందిని ఆసుపత్రులకు తరలించామని.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 1,970 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు.

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తుండటంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలు అతలాకుతలం అవుతున్నాయి. రాయనపేట, నెల్లిపాక, కన్నాయిగూడెం, మురుమూరు ప్రధాన, జాతీయ రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతోంది. రాకపోకలు స్తంభించాయి. కూనవరం మండలంలో 15 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.