పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం.. కూలిన పార్లమెంట్‌ భవనం పైకప్పు

దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికా పార్లమెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేప్ టౌన్‌లోని ఓల్డ్‌ పార్లమెంట్‌ బిల్లింగ్‌ మూడో అంతస్తులో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడి పక్కనే ఉన్న ప్రస్తుత పార్లమెంట్‌ నేషనల్‌ అసెంబ్లీ భవనానికి వ్యాపించాయి. దాంతో పార్లమెంట్‌ భవనం పైకప్పు కూలిపోయింది. జనవరి 2న ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


ప్రమాదంపై స్పందించిన పార్లమెంట్‌ స్పీకర్‌ నొసవివే ఈ మంటలు ప్రమాదవశాత్తు చెలరేగాలయా లేక విద్రోహ చర్యా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అగ్ని కీలల వేడికి ఆ కాంప్లెక్స్‌లోని మిగతా భవనాలు, వాటిలోని కళాఖండాలు దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రెసిడెంట్ సిరిల్ రమాఫోసా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. మొదట మంటలు చెలరేగిన పార్లమెంట్‌ భవనం 1880 కాలం నాటిది కాగా నేషనల్‌ అసెంబ్లీ భవనం ఇటీవలే నిర్మించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/