గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

-కోవిడ్‌ వార్డులో చెలరేగిన మంటలు

Urban SP Ammireddy learns details from GGH Superintendent
Urban SP Ammireddy learns details from GGH Superintendent

Guntur: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.కోవిద్‌ వార్డులోని కరెంటుబోర్డు అధికలోడు కారణంగా షార్టుసర్య్కూట్‌ అయింది.దీంతో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.మంటల తీవ్రత ఎక్కువ కావడంతో వార్డులో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ లీకై ఆక్సిజన్‌ గ్యాస్‌ బయటకు వచ్చింది.

  • -విద్యుత్‌ షార్టుసర్క్యూట్‌ కారణంగా ఘటన
  • -ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న రోగులు

అప్పటికే కోవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న 15మంది కరోనా రోగులు, వార్డు పక్కనే గల డయాలసిస్‌వార్డులో ఐదుగురు రోగులున్నారు.ఒక్కసారిగా కరెంటుపోయి మంటలు చెలరేగి అక్సిజన్‌ లీకవడంతో వారంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు.వార్డులో సంచరిస్తున్న నాట్కో కో-ఆర్డినేటర్‌ అవినాశ్‌ వెంటనే అప్రమత్తమై వార్డులో గల ఫైర్‌ సేప్టీ సిలిండర్ల్‌ను ఉపయోగించి మంటలు వ్యాపించకుండా అదుపుచేశాడు.

దీంతో పక్కవార్డులో రోగులు ఊపిరిపీల్చుకున్నారు.లీకవుతున్న ఆక్సిజన్‌ను ఆస్పత్రి సిబ్బంది మరమ్మత్తు చేశారు.ఆస్పత్రిలో నెలకొన్న అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక దళం హుటాహుటిన చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి ఆస్పత్రికి చేరుకొని అగ్నిప్రమాదానికి గల కారణాలను సూపరింటెండెంట్‌ నుంచి అడిగి తెలుసుకున్నారు.కోవిడ్‌ వార్డులో పర్యటించి రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆస్పత్రి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
అగ్నిప్రమాదానికి గురైన వార్డులో ఉన్న రోగులను ఇతర వార్డులకు మార్చి వారికి చికిత్స అందిస్తున్నారు.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
An electrician repairing a leaking oxygen pipeline

అనంతరం ఆస్పత్రికి చేరుకున్న తూర్పుఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ ఆస్పత్రి పాతబిల్డింగ్‌లో 25ఏండ్ల క్రితం ఏర్పాటుచేసిన విద్యుత్‌ వైరింగ్‌ కారణంగా షార్టు సర్క్యూట్‌ జరిగి ఉండవచ్చన్నారు.జిల్లా ఇన్‌చార్జీ మంత్రి చెరుకువాడ రంగనాధరాజు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళి ఆస్పత్రిలో పాతవైరింగ్‌ స్థానంలో కొత్త వైరింగ్‌ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.దేవుడి దయవల్ల ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఆనందంగా ఉందన్నారు.

సకాలంలో స్పందించిన సిబ్బందిని ఆయన అభినందించారు.భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతిని ఆదేశించారు.

తూర్పు డిఎస్పీ సీతారామయ్య, కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డి,నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు,ఏడిఎఫ్‌ఓ వేణుగోపాలరావు పరిస్థితిని పర్యవేక్షించారు.కార్యక్రమంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌ ప్రవీణ్‌,ఆస్పత్రి అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/