ఘోర అగ్నిప్రమాదం… 52 మంది మృతి

బంగ్లాదేశ్ లో ఆరు అంతస్తుల భవనంలో మంటలు

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారు ప్రాంతంలోని హషీమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనలో 52 మంది దుర్మరణం పాలయ్యారు. రూప్ గంజ్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో అందులో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశారు. ఘటన జరిగిన సమయంలో చాలామంది కార్మికులు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకి గాయాలపాలయ్యారు. 30 మంది క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే, ఫ్యాక్టరీలో ఇంకా ఎంత మంది కార్మికులు చిక్కుకున్నారో స్పష్టంగా తెలియడం లేదని పోలీసులు తెలిపారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు ఫైర్‌ సర్వీస్‌ ప్రతినిధి దేబాషిష్‌ బర్దన్‌ పేర్కొన్నారు. అయితే, మంటలు చెలరేగిన సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారని మహ్మద్‌ సైఫుల్‌ అనే కార్మికుడు తెలిపాడు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో తాను, మరో 13 మంది కార్మికులు కలిసి పైకప్పుపైకి పరుగెత్తామని, నల్లటి పొగ మొత్తం ఫ్యాక్టరీని కప్పేసిందని మరో కార్మికుడు మమూన్‌ చెప్పాడు. అగ్నిమాపక సిబ్బంది తమను రక్షించారని తెలిపాడు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/