సోమశిల కొండల్లో అగ్నిప్రమాదం

ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు భారీగా చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్యూట్, రసాయనాలు, నల్లమందు వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్యనే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ కాంప్లెక్స్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు మరణించారు. నిన్నటికి నిన్న ఖమ్మం జిల్లాలో బాణ సంచాను పేల్చే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మరణించారు. ఇలా ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాద వార్త వార్తల్లో నిలుస్తుంది.

తాజాగా నెల్లూరు జిల్లాలోని సోమశిల కొండల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు పరిధిలో ఉన్న సోమశిల కొండల్లో కార్చిచ్చు చెలరేగింది. రాత్రి సమయంలో కొండల్లో తలెత్తిన మంటలు గాలులతో భారీగా వ్యాపించాయి. వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో అడవుల్లో ఉండే ఎండు గడ్డి కారణంగా మంటలు భారీగా వ్యాపించాయి. జలాశయానికి ఉత్తరం వైపు ఉన్న కొండల్లో ఈ మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు రేంజర్ రామకొండారెడ్డి.. సిబ్బంది మంటలు ఆర్పేందుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఘటన ప్రాంతంలోకి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకోచ్చారు. కాగా సోమశిల కొండల్లో తరచూ మంటలు రేగుతున్నాయని..ఆ మంటల వల్ల అటవీ సంపదకు నష్టం జరుగుతుందని స్థానికులు అంటున్నారు. ఆ మంటల ధాటికి జంతువులు, వన్యమృగాలు ఊర్లలోకి వస్తున్నాయని సమీప గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.