బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుడు

Fire-Accident-in-Bollaram-Industrial-Estate

బొల్లారం: సంగారెడ్డి జిల్లా ఐబీఏ బోల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిప్రమాదం జరగడంతో కార్మికులు భయంతో చెల్లాచెదురయ్యారు. మంటలు వ్యాపించడంతో పరిశ్రమ నుంచి వెలుపలికి పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వింధ్యా ఆర్గానిక్స్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు.

కాగా, పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. కాగా, మంటలు ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో అధికారులు సమీపంలోని పరిశ్రమలను కూడా ఖాళీ చేయిస్తున్నారు. నల్లని పొగలు సుడులు తిరుగుతూ అక్కడి వాతావరణం భీతావహంగా ఉంది. కాగా, పరిశ్రమలోని ఓ రియాక్టర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడైంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బాచుపల్లి ఆసుపత్రికి తరలించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/